ఈ పొత్తు ఎందుకంటే...!: చంద్రబాబు

  • టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య సీట్ల పంపకంపై స్పష్టత
  • నేడు టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
  • మూడు పార్టీల కూటమి 160కి పైగా స్థానాల్లో గెలవాలన్న టీడీపీ అధినేత
  • ప్రతి చోటా మూడు జెండాలు కలిసి ముందుకు సాగాలని పిలుపు
ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న బీజేపీ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా, జనసేనాని పవన్ కల్యాణ్ లతో దాదాపు 8 గంటల పాటు సమావేశమై సీట్ల పంపకంపై చర్చించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్ లెవల్ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికలకు సన్నద్ధత, పొత్తులు, ఎన్నికల అభ్యర్థుల పనితీరుపై చర్చ చేపట్టారు. పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మూడు పార్టీల పొత్తు ఎందుకో కార్యకర్తలకు, నేతలకు వివరించారు. 

ఈ పొత్తు కేవలం జగన్ ను ఓడించడం కోసమే కాదని, రాష్ట్రాన్ని విజేతగా నిలపడం కోసమని అన్నారు. ఏపీ పునర్ నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు అని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసమే మూడు పార్టీలు చేయి కలిపాయి అని వివరించారు. 

కేంద్రం సహకారం ఉంటేనే...!

మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే కేంద్ర సహకారం అవసరం. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. 25 ఏళ్ల క్రితమే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పని చేసింది. పోలవరం పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రసాయం ఎంతో అవసరం. 

అనేక సర్వేలు చేసి, నూతన విధానాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం... నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జోరు పెరిగింది... క్షేత్రస్థాయిలో జోష్ వచ్చింది. టిక్కెట్ పొందిన నేతల పనితీరుపై చివరి నిమిషం వరకు సమీక్షిస్తాం. ప్రజల్లో లేకపోయినా, మంచి పేరు తెచ్చుకోకపోయినా... వారిని మార్చడానికి వెనుకాడను.

చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించాలి!

చిలకలూరిపేటలో జరిగే 17వ తేదీ సభ కొత్త చరిత్ర సృష్టించాలి. ప్రజల భాగస్వామ్యంతో కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేసి సత్తా చాటాలి. విధ్వంస పాలనలో శిథిలంగా మారిన రాష్ట్రాన్ని నిలబెట్టడంలో తొలి అడుగే ఉమ్మడి సభ. ప్రధాని పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. 

ఈసారి ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి సీటు ముఖ్యమే. మూడు పార్టీల కూటమి 160కి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలి. విభేదాలు ఉంటే పక్కనపెట్టండి... విజయమే లక్ష్యంగా పనిచేయండి. ప్రతి చోటా మూడు జెండాలు కలిసి ముందుకు సాగాలి.

జగన్ వాటినే నమ్ముకున్నాడు

జగన్ జనాన్ని నమ్ముకోలేదు... పోలింగ్ లో అక్రమాలనే నమ్ముకున్నాడు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలి. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని నియమించుకుని ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలి. 

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత వైసీపీ ఆగడాలు... తప్పుడు అధికారుల ఆటలు సాగవు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇచ్చేందుకు అంగీకరించారు. అధికారులు అంతా ఆలోచించుకోవాలి... మాకు మద్దతుగా ఉండమని కోరడం లేదు... చట్టబద్ధంగా  పని చేయమని కోరుతున్నాం.


More Telugu News