నా జీవితకాల స్వప్నం ఇన్నాళ్లకు నెరవేరింది: దేవిశ్రీ ప్రసాద్

  • ఇన్ స్టాగ్రామ్ లో దేవి ఆసక్తికర పోస్టు
  • చెన్నైలో దేవిశ్రీ ప్రసాద్ స్టూడియోను సందర్శించిన ఇళయరాజా
  • ఆనందంతో పొంగిపోతున్న దేవి
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసున్న ఫొటోను పంచుకున్న దేవిశ్రీ ప్రసాద్... తన జీవితకాల స్వప్నం ఇన్నాళ్లకు నెరవేరింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇళయరాజా తన స్టూడియోను సందర్శించారని వెల్లడించారు. 

"అసలు ఈ సంగీతం అంటే ఏమిటి అని ఏమాత్రం తెలియని చిన్న వయసులో నాపై ఈ మ్యాస్ట్రో, ఇసైజ్ఞాన్ని ఇళయరాజా తన సంగీతంతో సమ్మోహనాస్త్రం విసిరారు. నేను ఇళయరాజా సంగీతంతోనే పెరిగి పెద్దవాడ్నయ్యాను. నేను పరీక్షలకు చదువుకుంటున్నప్పుడు కూడా ఇళయరాజా పాటలు నా చుట్టూ వినిపిస్తుండాల్సిందే. ఇళయరాజా సంగీతం నా నుంచి విడదీయలేని భాగమైపోయింది. నేను కూడా సంగీత దర్శకుడ్ని కావాలన్న బలమైన వాంఛను నాలో పురికొల్పింది కూడా ఈయన సంగీతమే. 

కాలక్రమంలో నేను సంగీత దర్శకుడ్ని అయ్యాను, సొంతంగా స్టూడియో నిర్మించుకున్నాను. అందులో ఇళయరాజా నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశాను. ఇక నా జీవితంలో అతిపెద్ద కల ఏంటంటే... ఇళయరాజా సర్ నా స్టూడియోను సందర్శించాలి, తన చిత్రపటం పక్కన ఆయన నిలుచుని ఉండగా, ఆయనతో నేనొక ఫొటో దిగాలి. అయితే మనం అనుకున్నవన్నీ ఎప్పుడూ వెంటనే జరగవు కదా! 

ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. అది కూడా నా గురువు మాండోలిన్ శ్రీనివాస్ అన్న పుట్టినరోజు నాడే కావడం విశేషం. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నా జీవితంలోనే అత్యంత భావోద్వేగ క్షణాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఇవే. 

మీ రాకతో నా స్టూడియోని పావనం చేసినందుకు, నాకు, నా బృందానికి ఆశీస్సులు అందించినందుకు ప్రియాతిప్రియమైన సంగీత దేవుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా సర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు, మాకు తెలియని విషయాలు నేర్పుతున్నందుకు ధన్యవాదాలు సర్. మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తున్నాను రాజా సర్" అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News