సినిమాలు లేకపోయినా ఇంత లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యం? అంటూ వస్తున్న విమర్శలపై సురేఖా వాణి స్పందన

  • గతంలో టాలీవుడ్ లో ఎంతో బిజీగా ఉన్న సురేఖా వాణి
  • ప్రస్తుతం తమిళంలో నటిస్తున్నానని వెల్లడి
  • పాత కారు అమ్మి మరో సెకండ్ హ్యాండ్ కారు కొన్నామని వివరణ
  • ఇప్పటికీ తమకు సొంత ఇల్లు లేదని స్పష్టీకరణ
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఒకప్పుడు ఎంతో బిజీ నటి. దాదాపు అగ్రహీరోల సినిమాలన్నింటిలో ఆమె ఉండేది. కానీ ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రాలు లేవనే చెప్పాలి. కొన్నాళ్ల కిందట సురేఖా వాణి భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తర్వాత సురేఖ వాణి, తనకు కుమార్తె సుప్రీతతో కలిసి అనేక వీడియోల్లో దర్శనమిచ్చారు. 

చిట్టిపొట్టి డ్రస్సులు, పబ్ కల్చర్ తో మోడ్రన్ గా ఉన్న సురేఖా వాణిని ఆ వీడియోల్లో చూడొచ్చు. దాంతో ఆమె లైఫ్ స్టయిల్ పై అనేక విమర్శలు వచ్చాయి. చేతిలో సినిమాలు లేకపోయినా ఇంత లగ్జరీ జీవితం ఎలా సాధ్యం? అంటూ కథనాలు వచ్చాయి. ఓ అడుగు ముందుకేసి, ఆమె మరో రిలేషన్ లో ఉందంటూ పుకార్లు కూడా బయల్దేరాయి.

దీనిపై సురేఖా వాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో  స్పందించారు. తన ముఖంలో, వేషధారణలో సహజంగానే రిచ్ నెస్ ఉంటుందని, అందుకే అందరూ మరో విధంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినా, తమిళంలో నటిస్తున్నానని వెల్లడించారు. 

అంతేకాదు, తమకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని సురేఖా వాణి స్పష్టం చేశారు. పాత బీఎండబ్ల్యూ కారును అమ్మేసి ఈఎంఐ పద్దతిలో రేంజ్ రోవర్ కారు కొనుక్కున్నామని తెలిపారు. అది కూడా సెకండ్ హ్యాండ్ కారేనని వివరించారు. 

ఇక, తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయని, అందులో నిజం లేదని అన్నారు. రిలేషన్ షిప్ అంటేనే భయం వేస్తోందని, అలాంటివాటిపై తనకు నమ్మకం లేదని సురేఖా వాణి వెల్లడించారు.


More Telugu News