లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున ఖర్గే దూరం!

  • పోటీ చేసి ఒక నియోజకవర్గానికే పరిమితం కాకూడదని భావిస్తున్న ఖర్గే
  • దేశవ్యాప్తంగా ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి ఉన్నందున పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారన్న పార్టీ వర్గాలు
  • ఇప్పటికే కేటాయించిన గుల్బర్గా సీటు నుంచి ఖర్గే అల్లుడిని బరిలోకి దింపవచ్చంటూ ఊహాగానాలు
వయసు రీత్యా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ నిర్ణయించుకోగా.. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల బరిలో నిలవకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక స్థానంలో పోటీ చేసి అక్కడి ప్రచారానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలపై దృష్టి పెట్టాలంటూ పార్టీ సీనియర్ సభ్యులు సూచిస్తుండడంతో పోటీ నుంచి విరమించుకోవాలని ఖర్గే భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సెంటిమెంట్‌గానే ఉన్నప్పటికీ పార్టీని ముందుండి నడిపించేందుకు ఖర్గే పోటీ చేయకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా కర్ణాటకలోని గుల్బర్గా నియోజకవర్గం నుంచి మల్లికార్జున ఖర్గే పోటీకి గతవారమే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తొలి అభ్యర్థుల జాబితాలో పార్టీ అధ్యక్షుడి పేరుని కూడా ప్రకటించింది. అయితే ఆ స్థానంలో ఖర్గే అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణిని బరిలో దింపవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర మంత్రిగా ఉన్న ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అనాసక్తిగా ఉన్నారు. కాగా గుల్బర్గా నియోజకవర్గం నుంచి ఖర్గే రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనని రాజ్యసభకు పంపించింది. ఈ పదవీకాలం మరో నాలుగేళ్లు మిగిలివుంది.


More Telugu News