14 నెలల తర్వాత రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు.. బీసీసీఐ కీలక ప్రకటన

  • పంత్ ఫిట్‌గా ఉన్నాడంటూ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
  • ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు కీలక ప్రకటన
  • పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ అందుబాటులో ఉండబోరని నిర్ధారణ
రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో తిరిగి అడుగుపెట్టబోతున్నాడు. ఐపీఎల్ 2024‌లో ఆడడానికి పంత్ సంపూర్ణ ఫిట్‌నెస్‌తో సంసిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ నిర్ధారించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. ‘‘2022 డిసెంబర్ 30న ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ సుమారు 14 నెలల సుదీర్ఘ పునరావాసం, రికవరీ ప్రక్రియ అనంతరం రాబోయే ఐపీఎల్ 2024లో ఆడేందుకు వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఫిట్‌గా ఉన్నాడు’’ అని ప్రకటనలో పేర్కొంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్యాంప్‌తో కలిసేందుకు పంత్‌కు అనుమతి లభించింది. కాగా ఐపీఎల్ ఆడడమే లక్ష్యంగా పంత్ ఇదివరకే ప్రాక్టీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం కూడా తీసుకున్నాడు. అతడిని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2024కు షమీ, ప్రసిద్ధ్ కృష్ణ దూరం
టీమిండియా స్టార్ పేసర్లు మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్2024 ఎడిషన్‌కు అందుబాటులో ఉండబోరని బీసీసీఐ నిర్ధారించింది. ప్రసిద్ధ్ కృష్ణ ఎడమ కాలుకి శస్త్రచికిత్స చేయించుకున్నాడని, ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసాన్ని ఆరంభించనున్నాడని, రాబోయే టాటా ఐపీఎల్2024లో పాల్గొనబోడని వివరించింది. మరోవైపు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కుడి కాలు మడమకు ఫిబ్రవరి 26, 2024న శస్త్రచికిత్స జరిగిందని, అతనిని కూడా ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, ఈ కారణంగా ఐపీఎల్2024కు అందుబాటులో ఉండడంలేదని వివరించింది. వీరిద్దరూ టీ20 వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉండడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News