చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై స్పందించిన యాజమాన్యం

  • మార్చి 22 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్
  • తనను ఈసారి కొత్త పాత్రలో చూస్తారంటూ ధోనీ ట్వీట్
  • ధోనీ స్థానంలో సీఎస్కే కెప్టెన్ ఎవరంటూ చర్చ
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సీఎస్కే జట్టును అగ్రశ్రేణి జట్టుగా నిలపడంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర ఎనలేనిది. అయితే, ఇటీవల ధోనీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో కలకలం రేగింది. తనను త్వరలో కొత్త పాత్రలో చూస్తారని ధోనీ ఆ పోస్టులో పేర్కొన్నాడు. అంటే, రాబోయే సీజన్ లో ధోనీ కెప్టెన్ గా తప్పుకుని కోచ్ అవతారం ఎత్తుతాడా? అనే సందేహాలు వస్తున్నాయి. 

ఒకవేళ ధోనీ సీఎస్కే కెప్టెన్ గా తప్పుకుంటే, అతడి వారసుడు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీఎస్కే యాజమాన్యం స్పందించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్ ల ఎంపికపై బయట ఎక్కడా మాట్లాడవద్దని చెన్నై ఫ్రాంచైజీ అధినేత ఎన్.శ్రీనివాసన్ స్పష్టంగా చెప్పారని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. 

అయితే, ధోనీ తర్వాత చెన్నై జట్టును నడిపించే సారథి ఎవరన్నదానిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును ధోనీకి, కోచ్ కి కల్పిస్తామని, వారు ఒక నిర్ణయం తీసుకుని తమకు చెబితే, తదుపరి కెప్టెన్ ఎవరో వెల్లడిస్తామని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అప్పటివరకు ఎలాంటి సమాచారం బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు.


More Telugu News