చంద్రబాబు ఇంటివద్ద హంగామా చేసిన కేఏ పాల్

  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ముందు కారును ఆపిన పాల్
  • పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు
  • చంద్రబాబు నుంచి ప్రజలు ఏమీ ఆశించడం లేదని వ్యాఖ్య
కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ముద్రగడ అలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు నుంచి తన కారులో వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో చంద్రబాబు, కేంద్రమంత్రి షెకావత్, జనసేనాని పవన్ కల్యాణ్ లు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంటి ముందు పాల్ కాసేపు హల్ చల్ చేశారు. పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.  

చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు చేశారని విమర్శించారు. పాలన అంటే సినిమాలో డ్యాన్సులు చేయడం కాదని ఎద్దేవా చేశారు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా ఏపీని మోసం చూస్తూనే ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెపుతారని అన్నారు. సినీ నటుడు, సీనియర్ లీడర్ బాబూ మోహన్ కూడా తమ పార్టీలో చేరారని... మరింత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరాలని ఆయన కోరారు. 


More Telugu News