ష‌మీ, రిష‌బ్ పంత్ పున‌రాగ‌మ‌నంపై జై షా ఏమ‌న్నారంటే..!

  • ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌తో స్వ‌దేశంలో జ‌రిగే సిరీస్‌తో మహ్మద్ షమీ పున‌రాగ‌మ‌నం 
  • టీ20 ప్రపంచకప్‌కు కూడా స్టార్ పేస‌ర్‌ దూరం
  • ఎన్‌సీఏలో కేఎల్ రాహుల్‌.. ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడ‌ని జై షా ప్ర‌క‌ట‌న‌
  • ఐపీఎల్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగానే రిష‌బ్ పంత్ భ‌విత్యం ఉంటుందని తేల్చేసిన బీసీసీఐ సెక్రటరీ
చీలమండ గాయానికి శస్త్రచికిత్స త‌ర్వాత‌ కోలుకుంటున్న భారత పేసర్ మహ్మద్ షమీ ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడని బీసీసీఐ కార్యదర్శి జై షా పీటీఐకి తెలిపాడు.

ఇక షమీ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే. అలాగే గత నెలలో చీల‌మండ‌ గాయానికి స‌ర్జ‌రీ చేయించుకోవ‌డంతో విశ్రాంతి అవ‌స‌రం అయింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉంటాడు. ఇదే కార‌ణంగా జూన్‌లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు కూడా అతను దూరం కానున్నాడు.

కాగా, షమీ చివరిసారిగా స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్రపంచకప్‌లో ఆడాడు. ఈ మెగా టోర్నీలో త‌న‌దైన అద్భుత‌మైన ఆట‌తో ఆకట్టుకున్నాడు కూడా. కేవ‌లం 7 మ్యాచుల్లోనే 20కి పైగా వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇలా వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌లో ష‌మీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మెప్పించాడు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ ద్వారానే ష‌మీ పున‌రాగ‌మ‌నం చేయ‌నున్నాడు.

"షమీకి శస్త్రచికిత్స పూర్తయింది. అతను తిరిగి ఇండియాకు వచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌కు షమీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కేఎల్‌ రాహుల్‌కి ఇంజెక్షన్ అవసరం. అతను ఎన్‌సీఏలో ఉన్నాడు" అని జై షా మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. రాహుల్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోని చివరి నాలుగు టెస్టులకు దూరమయ్యాడు. లండన్‌లో చికిత్స చేయించుకున్న అతను ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు అందుబాటులో ఉంటాడ‌ని స‌మాచారం.

భార‌త వికెట్ కీప‌ర్‌ రిషబ్ పంత్ తిరిగి జాతీయ‌ జ‌ట్టులోకి వ‌చ్చే విష‌యమై కూడా బీసీసీఐ సెక్రటరీ స్పందించాడు. ఐపీఎల్ ఆడ‌టానికి పంత్‌ సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. కాగా, పంత్ 2022 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా పూర్తిగా క్రికెట్‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే.

"అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కీపింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. ఐపీఎల్‌లో రిష‌బ్ పంత్ ప్ర‌ద‌ర్శ‌న అత‌ని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ భ‌విత్యాన్ని తేల్చ‌నుంది. అతను మా కోసం టీ20 ప్రపంచ కప్ ఆడగలిగితే, అది మాకు చాలా పెద్ద విషయం. టీమిండియాలో ఎప్పుడూ అత‌ను కీల‌క ఆట‌గాడే. ఐపీఎల్‌లో అతను ఎలా రాణిస్తాడో చూద్దాం" అని షా అన్నాడు.

ఇదిలాఉంటే.. ఐపీఎల్‌లో విదేశీ పెట్టుబడుల విష‌య‌మై అడిగిన ప్రశ్నకు.. బీసీసీఐ ఒక సొసైటీ అని, ఒక కంపెనీని పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని జై షా అన్నాడు. అందులో ఎవరూ పెట్టుబడులు పెట్టలేరని స్పష్టం చేశాడు. కాగా, సౌదీ అరేబియా ఐపీఎల్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు గత ఏడాది వార్తలు వచ్చాయి.


More Telugu News