పథకాల సొమ్ము ఖాతాల్లో పడుతుంటే సమావేశాల్లో ఎవరుంటారు?: మహిళలపై మంత్రి ధర్మాన అనుచిత వ్యాఖ్యలు

  • మంత్రి మాట్లాతుండగానే సమావేశం నుంచి వెళ్లిపోయిన మహిళలు
  • గేటు మూసి వలంటీర్లు కాపలా ఉన్నా మరో గేటు నుంచి వెళ్లిపోయిన వైనం
  • తాను రాకముందే వారొస్తే ఇలాగే ఉంటుందన్న మంత్రి
  • పథకాల లబ్ధిపొంది ప్రభుత్వానికి విధేయులుగా లేని వారిని పట్టించుకోవాల్సిన పనిలేదని ఆగ్రహం
  • బుద్ధిలేని వారిని వదిలేయడమే మేలన్న మంత్రి
ఏపీ రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా పథకాల సొమ్ములు ఖాతాల్లో పడుతుంటే తమ సమావేశాల్లో వారెందుకు ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీకాకుళంలో సోమవారం చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి వైఎస్సార్ చేయూత చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతుండగా మహిళలు ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోయారు. వలంటీర్లు గేటు మూసివేసి కాపలా ఉన్నా, మరో గేటు నుంచి వారు బయటకు వెళ్లిపోయారు.

ప్రసంగిస్తుండగానే మహిళలు ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోతుండడంతో అసహనానికి గురైన మంత్రి.. ఇలా జరుగుతుందనే తాను రావడానికి కాసేపటి ముందు మాత్రమే వారిని తీసుకురమ్మని చెబుతుంటానని, కానీ వారు తనకంటే ముందే వస్తే జరిగేది ఇదేనని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పథకాల నుంచి లబ్ధి పొంది కూడా ప్రభుత్వానికి విధేయులుగా లేని పనికిమాలిన వారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని పరుష వ్యాఖ్యలు చేశారు. 

తమకు కుల, మత భేదాలు లేవని, ఒంటిపై పసుపు చొక్కా ఉన్నా, తమకు ఓటు వేయకపోయినా వారి కన్నీరు తుడిచే పనిచేస్తామని పేర్కొన్నారు. తమకూ ఓ వర్గం ఉందని, అందులో ఉంటామని వారు అంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన పనిలేదని అన్నారు. బుద్ధిలేని వారిని వదిలేయాలని పేర్కొన్నారు. అన్ని పథకాల లబ్ధి పొంది అడ్డంగా మాట్లాడితే అలాంటి వారిని వదిలేయాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి.


More Telugu News