దిగొచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ.. చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ.. కారణం ఇదేనా?

  • ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ
  • లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ
  • చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు
ప్రతిపక్షాల హెచ్చరికలో, మరో కారణమో.. ఏమో కానీ మొత్తానికి ఏపీఎస్ ఆర్టీసీ దిగొచ్చింది. చిలకలూరిపేటలో ఈ నెల 17న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ భారీ బహిరంగ సభకు బస్సులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇన్నాళ్లూ ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఒక్క బస్సు ఇచ్చేందుకు కూడా ససేమిరా అన్న ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు మాత్రం ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కోరడం విశేషం.

ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం వెనక కారణం వేరే ఉందని చెబుతున్నారు. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరవుతుండడమే ఇందుకు కారణమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధాని హాజరయ్యే సభకు బస్సులు ఇవ్వకుండా ఆయన ఆగ్రహానికి గురికావడం భావ్యం కాదని భావించే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 

చిలకలూరిపేట సభకు బస్సులు కావాలంటూ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. వెంటనే స్పందించిన అధికారులు ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇస్తే సమకూరుస్తామని కబురు పంపడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.


More Telugu News