నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు!

  • నేటి మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ
  • జీరోవడ్డీ రుణాలకు నిధుల కేటాయింపు
  • నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం 
  • మరింత పకడ్బందీగా రైతు భరోసా
  • ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏపైనా నిర్ణయం
  • నేటి సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ మహిళా సదస్సు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పుచేర్పులు, వర్షాకాలం నుంచి పంటల బీమా అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లు మరోమారు గవర్నర్ చెంతకు
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్‌ పేర్లను మరోమారు గవర్నర్ ఆమోదం కోసం పంపడంతోపాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, నేటి సాయంత్రం నాలుగున్నర గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో మహిళలకు జీరో వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.


More Telugu News