భట్టివిక్రమార్కకి అవమానం అంటూ బీఆర్ఎస్ మొసలి కన్నీరు: పక్కన కూర్చోబెట్టడంపై మల్లు రవి వివరణ

  • దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వెల్లడి
  • బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను అవమానించిందని విమర్శలు
  • యాదగిరిగుట్టలో సీఎం పక్కన నల్గొండ జిల్లా మంత్రులను, భద్రాద్రిలో మల్లు భట్టి విక్రమార్కను కూర్చుండ బెట్టారని వివరణ
యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసునన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎల్పీ విలీనం అంటూ కొత్త కథ అల్లి ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందని ఆరోపించారు.

కానీ ఇప్పుడేమో అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ముఖ్యమంత్రి అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పదేళ్లు పాలించారని మండిపడ్డారు. కానీ మల్లు భట్టికి ఉపముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.

పక్కన కూర్చోబెట్టడంపై వివరణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన యాదగిరిగుట్టలో నల్గొండ జిల్లా మంత్రులను కూర్చోబెట్టారని, మిగతా వారిని ఆ పక్కన కూర్చోబెట్టారన్నారు. భద్రాచలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన... ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కూర్చోబెట్టారని వివరించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు చాలా సఖ్యతతో, సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో జరిగే అంశాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడాల్సిన అవసరం లేదని మల్లు రవి చురక అంటించారు.


More Telugu News