రాష్ట్ర డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

  • లోకేశ్ శంఖారావం సభల్లో భదత్రా వైఫల్యాలు చోటుచేసుకున్నాయంటూ లేఖ
  • భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్న వర్ల రామయ్య
  • ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదంటూ డీజీపీకి లేఖ
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం సభలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వర్ల రామయ్య తన లేఖలో ఆరోపించారు. 

భద్రత కల్పించాలని కోరినా పోలీసులు విస్మరించారని వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో లోకేశ్ చేపట్టిన శంఖారావం సభల్లో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయని తెలిపారు. 

ఈ సభలకు భారీగా జనాలు వచ్చారని, దాంతో తోపులాట చోటుచేసుకుని లోకేశ్ పర్సనల్ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయని వర్ల రామయ్య వెల్లడించారు. కల్యాణదుర్గం, రాయదుర్గం సభల వద్ద కనీసం ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నారు. 

విపక్షనేతలకు భద్రత కల్పించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ఇకనైనా భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. గతంలో భద్రతా వైఫల్యాలపై అనేక ఫిర్యాదులు చేసినా పోలీసులు నిర్లక్ష్య వైఖరిని వీడకపోవడం బాధాకరమని వివరించారు.


More Telugu News