మోదీ పాలనను చూసి పార్టీలో చేరుతున్నారు... కానీ మొదటి నుంచి ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలి: మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్

  • ఆదిలాబాద్‌లో లంబాడాలకు టిక్కెట్ ఇస్తేనే గెలుస్తామని వ్యాఖ్య
  • తమ జనాభాను దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ కేటాయించాలని విజ్ఞప్తి
  • తనకు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని వెల్లడి
చాలామంది నేతలు ప్రధాని నరేంద్ర మోదీ పాలనను చూసి బీజేపీలో చేరుతున్నారని, కానీ మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారికి ఆదిలాబాద్ లోక్ సభ టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరామని మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అన్నారు. మాజీ ఎంపీ నగేశ్ బీజేపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రమేశ్ రాథోడ్... నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో కలిసి సోమవారం  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ లక్ష్మణ్‌లను కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఆదిలాబాద్‌లో లంబాడాలకు టికెట్ ఇస్తే గెలుస్తామన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి టిక్కెట్ ఇవ్వాలని తాము కోరామన్నారు. పార్టీలో చేరే వారిని అడ్డుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి న్యాయం చేస్తారని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో ఎనిమిది శాతం మంది లంబాడా బంజారాలు ఉన్నారని, గోండు, బంజారాలు, గిరిజన జాతులు మొత్తం 3.5 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. లంబాడా బంజారా ఓట్లు లక్షన్నర వరకు ఉన్నాయన్నారు.

తమ జనాభాను దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ కేటాయించాలని కోరారు. తమకు ఇక్కడి ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ జనాభా కన్నా లంబాడా బంజారా జనాభా ఎక్కువ ఉందన్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని... కానీ నగేశ్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినట్లు తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. కాగా, లక్ష్మణ్‌ను కలిసిన రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు జిల్లాలోని పరిస్థితులను వివరించారు.


More Telugu News