ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ఓట్లు అడగాలి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

  • ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పారని గుర్తు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాలన సాగించాలని చూస్తున్నారని ఆరోపణ
  • షెడ్యూల్ వచ్చాక రుణమాఫీ, రైతుబంధు ఎలా అమలు చేస్తారని ప్రశ్న
ఆరు గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని... కాబట్టి వాటిని నెరవేర్చాకే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. వాటిని అమలు చేయకుంటే లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగమని నాడు స్వయంగా కాంగ్రెస్ నేతలు, మంత్రులే చెప్పారని తెలిపారు. అందుకే వాటిని అమలు చేస్తేనే ప్రజల వద్దకు వెళ్లాలన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాలన సాగించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్పితే ప్రజలకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రుణ మాఫీ, రైతుబంధు ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. మంగళవారం జరిగే కేబినెట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలా అధిగమిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News