పాక్ అధ్యక్షుడు జర్దారీ కుమార్తెకు 'ప్రథమ మహిళ' హోదా!

  • పాక్ దేశాధ్యక్షుడిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన ఆసిఫ్ అలీ జర్దారీ
  • జర్దారీ భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన వైనం
  • భార్య లేకపోవడంతో కుమార్తెను 'ప్రథమ మహిళ'గా ప్రకటించనున్న జర్దారీ
ఏ దేశంలో అయినా అధ్యక్షుడి అర్ధాంగికి ఆ దేశ 'ప్రథమ మహిళ' హోదా లభిస్తుంది. అయితే పాకిస్థాన్ లో భిన్న పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ దేశాధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ పదవీప్రమాణం చేపట్టగా, ఆయన కుమార్తె ఆసిఫా బుట్టోను దేశ 'ప్రథమ మహిళ'గా ప్రకటించనున్నారు. జర్దారీకి భార్య లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

జర్దారీ భార్య ఎవరో కాదు... మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో.  ఆమె 2007లో హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి జర్దారీ ఎవరినీ వివాహం చేసుకోలేదు. అందువల్ల తన కుమార్తె ఆసిఫాకు దేశ 'ప్రథమ మహిళ' హోదా కల్పించాలని ఆయన నిర్ణయించారు. 

ఈ విషయాన్ని జర్దారీ పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో తన సోషల్ మీడియా పోస్టు ద్వారా నిర్ధారించారు. ప్రతికూల పరిస్థితుల నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి ప్రతి విషయంలోనూ దేశ 'ప్రథమ మహిళ' ఆసిఫా వెన్నంటే నిలిచింది అని భక్తావర్ పోస్టు చేశారు.


More Telugu News