ఆస్కార్ వేదిక‌పై భార‌తీయ ఆర్ట్ డైరెక్ట‌ర్‌కి ప్ర‌త్యేక గౌర‌వం

  • భార‌తీయ ఆర్ట్ డైరెక్ట‌ర్ నితిన్ దేశాయ్‌ని స్మ‌రించుకున్న‌ ఆస్కార్ వేదిక 
  • ల‌గాన్‌, జోధా అక్బ‌ర్, దేవ‌దాస్‌, మున్నాభాయ్ చిత్రాల ఆర్ట్ డైరెక్ట‌ర్
  • గ‌తేడాది ఆగ‌స్టులో ముంబైలోని క‌ర్జాత్‌లో విగ‌త‌జీవిగా క‌నిపించిన నితిన్ దేశాయ్‌
  • ఉత్తమ కళా దర్శకుడిగా మూడు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు.. నాలుగు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు 
  • 2005లో కర్జాత్‌లో 52 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌డీ స్టూడియోస్ ఏర్పాటు
ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భార‌తీయ ఆర్ట్ డైరెక్ట‌ర్ నితిన్ దేశాయ్‌ని ఆస్కార్ వేదిక స్మ‌రించుకుంది. గ‌త‌ ఏడాది కాలంలో చ‌నిపోయిన సినిమా లెజెండ్ల‌ను స్మ‌రించుకున్న సంద‌ర్భంలో నితిన్ దేశాయ్‌కి కూడా ఆస్కార్ వేదిక‌గా ఈ గౌర‌వం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు నితిన్ అందించిన సేవ‌ల‌ను ఆస్కార్ వేదిక గుర్తు చేసుకుంది. ల‌గాన్‌, హమ్ దిల్ దే చుకే స‌న‌మ్‌, జోధా అక్బ‌ర్, దేవ‌దాస్‌, మున్నాభాయ్ ఎంబీబీఎస్ త‌దిత‌ర బ‌డా బాలీవుడ్ చిత్రాల‌కు నితిన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. అలాగే ప్ర‌ముఖ టెలివిజ‌న్ క్వీజ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తికి కూడా ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆయ‌నే. అయితే, గ‌తేడాది ఆగ‌స్టులో ఆయ‌న ముంబై శివారు క‌ర్జాత్‌లో విగ‌త‌జీవిగా క‌నిపించారు. 

గ‌త రెండు దశాబ్దాల కాలంలో అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి నితిన్ దేశాయ్ పనిచేశారు. ఆయన విశిష్ట సేవ‌ల‌కు గాను నాలుగు సార్లు ఉత్తమ కళా దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు మూడు సార్లు ఉత్తమ కళా దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు.

2005లో నితిన్ దేశాయ్ ముంబైకి సమీపంలోని కర్జాత్‌లో 52 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌డీ స్టూడియోస్‌ను స్థాపించారు. ఈ స్టూడియో జోధా అక్బర్, ట్రాఫిక్ సిగ్నల్ వంటి ప్రముఖ చిత్రాలతో పాటు పాప్యులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌ను హోస్ట్ చేసింది.  


More Telugu News