కునో నేషనల్ పార్క్‌లో ఐదు కూనలకు జన్మనిచ్చిన 'గామిని'.. 26కు చేరిన మొత్తం చిరుత‌ల సంఖ్య

  • ద‌క్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ చీతా 'గామిని'  
  • కేవ‌లం భార‌త్‌లో పుట్టిన‌వే 13 పిల్లలు అని మంత్రి భూపేందర్ యాదవ్ ప్ర‌క‌టన
  • జ‌న‌వ‌రిలో జ్వాలా అనే చీతాకు ఒకే కాన్పులో 4 కూనలు
  • 1952లో భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు ప్ర‌క‌ట‌న‌
  • 2022లో భార‌త ప్ర‌భుత్వం 'ప్రాజెక్టు చీతా' కార్యక్రమానికి శ్రీకారం
మధ్యప్రదేశ్ రాష్ట్రం షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ‌ చిరుత 'గామిని' ఐదు కూన‌ల‌కు జన్మనిచ్చింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. భార‌త్‌లో పుట్టిన‌ మొత్తం చిరుత పిల్లల సంఖ్య 13కు చేరింద‌ని కేంద్ర మంత్రి తెలిపారు. ప్ర‌స్తుతం కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని అన్నారు. 

"హై ఫైవ్, కునో! దక్షిణాఫ్రికాలోని త్స్వాలు కలహరి రిజర్వ్ నుండి తీసుకురావ‌డం జ‌రిగింది.  5ఏళ్ల‌ ఆడ చిరుత గామిని ఈరోజు 5 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారతదేశంలో జన్మించిన చిరుత‌ పిల్లల సంఖ్య 13కి చేరుకుంది. భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది నాలుగోసారి" అని భూపేందర్ యాదవ్ 'ఎక్స్' (ఇంత‌కుముందు ట్విట‌ర్) పోస్ట్‌లో తెలిపారు. చిరుతలకు ప్ర‌శాంత‌మైన‌ వాతావరణం కల్పించినందుకు కునో నేషనల్ పార్క్‌లోని అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

"అందరికీ, ముఖ్యంగా చిరుతలకు ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించిన అటవీ అధికారులు, పశువైద్యులు, ఫీల్డ్ సిబ్బంది బృందానికి అభినందనలు. కునోలోని పిల్లలతో సహా మొత్తం చిరుతల సంఖ్య 26కి చేర‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం" అని పేర్కొన్నారు.

గతేడాది మార్చిలో జ్వాలా అనే చీతా ఒకే కాన్పులో 4 కూనలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రమే బతికింది. ఈ ఏడాది అదే చీతా జనవరిలో రెండోసారి 4 కూనలకు జన్మనిచ్చింది. అనంతరం ఆశ అనే చీతా 3 కూనలకు జన్మనిచ్చింది.

1952లో భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు ప్రకటించడం జ‌రిగింది. దాంతో భారత ప్రభుత్వం 2022లో 'ప్రాజెక్టు చీతా' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఎనిమిది నమీబియన్‌ చీతాలను అధికారులు కునో నేష‌న‌ల్‌ పార్కుకు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించారు. ఇక గతేడాది మార్చి నుంచి భారత్‌లో 10 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటివరకు భారతదేశంలో పుట్టిన ఏడు చిరుతలు, మూడు కూన‌లు చ‌నిపోయాయి.


More Telugu News