జగన్ ను ఓడించడానికి వ్యూహాలు అవసరం లేదు.. 40 నిమిషాలు నన్ను చితగ్గొట్టారు: రఘురామకృష్ణరాజు

  • జగన్ వ్యూహాలు ప్రజలందరికీ అర్థమయ్యాయన్న రఘురాజు
  • అమరావతి విషయంలో సిగ్గులేకుండా మాట తప్పారని విమర్శ
  • ఇదే విషయాన్ని చెపితే జగన్ కు కోపమొచ్చిందని వెల్లడి
సీఎం జగన్ వ్యూహాలు ప్రజలందరికీ అర్థమయ్యాయని... ఆయన వ్యూహంలో ఆయనే చిక్కుకుంటాడని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రజలంతా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఆ మాటలను తామంతా నమ్మామని, ఎన్నికల ప్రచారంలో కూడా అమరావతే రాజధాని అని చెప్పామని తెలిపారు. అమరావతి విషయంలో జగన్ సిగ్గులేకుండా మాట తప్పారని.. అదే విషయాన్ని జగన్ కు, ఆయన మనుషులకు కూడా తాను చెప్పానని అన్నారు. దీంతో, ఆయనకు కోపమొచ్చిందని చెప్పారు. 

గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను టార్చర్ చేసిన తర్వాత తనకు అయిన గాయాలను మీడియాలో చూపించారని, అదే తనను కాపాడిందని... లేకపోతే పైకి పోయేవాడినని రఘురాజు అన్నారు. 40 నిమిషాల పాటు తనను చితగ్గొట్టారని చెప్పారు. జగన్ ను ఓడించడానికి ప్రత్యేకంగా ఎలాంటి వ్యూహాలు అవసరం లేదని అన్నారు. నేరుగా జనాల్లోకి వెళ్లి, ఆయన చేసిన మోసాల గురించి వాళ్లకు వివరిస్తే చాలని చెప్పారు.

సీఎం జగన్ అవినీతిపై నాలుగు నెలల క్రితం కేసు వేశానని రఘురాజు తెలిపారు. పిటిషన్ కు సంబంధించి 40 మంది రెస్పాండెంట్స్ ఉన్నారని... ఒక్కోసారి ఒక్కొక్కరు టైమ్ అడుగుతున్నారని, ఈ క్రమంలో విచారణ వాయిదా పడుతూ వస్తోందని చెప్పారు. ఈ రోజు కూడా విచారణ వాయిదా పడిందని తెలిపారు. వచ్చే మంగళవారానికి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసిందని చెప్పారు. కేసులో 1,350 పేజీలను ఫైల్ చేశామని... ఆ స్థాయిలో అవినీతి ఉందని అన్నారు. తన పోరాటం తాను చేస్తానని అన్నారు.


More Telugu News