మల్లు భట్టి, కొండా సురేఖలను రేవంత్ రెడ్డి తమ కాళ్ల ముందు కూర్చోబెట్టుకున్నారు: బాల్క సుమన్

  • యాదాద్రిలో దళితులు, బహుజనులకు ఘోర అవమానం జరిగిందని వ్యాఖ్య
  • దేవుడి ముందే ఇంత అవమానం చేస్తే ఎలా? అని ప్రశ్న
  • మల్లు భట్టిని, కొండా సురేఖను అవమానించినందుకు గాను సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలను దేవుడి ముందే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కాళ్ల వద్ద కూర్చోబెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యాదాద్రిలో దళితులు, బహుజనులకు ఘోర అవమానం జరిగిందన్నారు. దేవుడి ముందే ఇంత అవమానం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటనల్లో కూడా మల్లు భట్టి విక్రమార్క ఫొటో ఉండటం లేదన్నారు. మల్లు భట్టిని, కొండా సురేఖను అవమానించినందుకు గాను బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో మంత్రులు దిగిన ఫొటోను ఆయన మీడియాకు చూపించారు.

మల్లు భట్టి విక్రమార్క కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటోందన్నారు. పార్టీ కోసం పాదయాత్ర చేశారని తెలిపారు. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వారందరి కంటే కాంగ్రెస్‌లో మల్లు భట్టి సీనియర్ అన్నారు. అలాంటి మల్లు భట్టిని అవమానించడం దారుణమన్నారు. ఇంతటి అవమానం చేసినందుకు గాను దళిత సంఘాలు, బీసీ సంఘాలు వెంటనే స్పందించాలని సూచించారు. తన శాఖ విషయంలో మల్లు భట్టికి ప్రాధాన్యత లేకుండా పోయిందని... చివరకు దేవుడి వద్ద కూడా ఇలా అవమానించారని మండిపడ్డారు. ఇది అనుకోకుండా జరిగింది కాదని... ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందన్నారు.


More Telugu News