తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భావం... వెబ్ సైట్ ప్రారంభించిన చిరంజీవి, లోగో ఆవిష్కరించిన పొంగులేటి

  • వెబ్ మీడియా రంగంలో విప్లవాత్మక రీతిలో తెలుగుడీఎంఎఫ్ ఏర్పాటు
  • కంటెంట్ క్రియేటర్లకు అండగా నిలిచేందుకు ఐక్య వేదిక
  • వెబ్ సైట్ ప్రారంభించిన చిరంజీవి... లోగో, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా (టీవీ చానళ్లు)కు ప్రత్యేక సంఘాలు, సమాఖ్యలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తొలిసారిగా వెబ్ మీడియా రంగంలోనూ ఓ ఐక్య వేదిక పురుడుపోసుకుంది. వెబ్ సైట్లు, ఇతర డిజిటల్ కంటెంట్ పోర్టళ్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు వేదికగా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగుడీఎంఎఫ్) ఆవిర్భవించింది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్లకు ఇకపై తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఓ గొంతుకగా, అండదండగా నిలవనుంది. ఈ సమాఖ్య ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 

ఈ ఫెడరేషన్ కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ www.telugudmf.com ను చిరంజీవి ఆవిష్కరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ లోగో, స్వాగత పోస్టర్లను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, నిజంగా ఈ ఫెడరేషన్ అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. వివిధ రకాల వెబ్ రైటర్లు, ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్లు, ట్విట్టర్ ఇన్ ఫ్లుయెన్సర్లు, మీమ్ సృష్టికర్తలను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు ఈ ఫెడరేషన్ ఏర్పడడం హర్షణీయం అని పేర్కొన్నారు. వారందరికీ మార్గదర్శనం చేయడం, ఆరోగ్య ప్రయోజనాలు అందించే చర్యలు తీసుకోవడం, సహకార భాగస్వామ్యాల రూపకల్పన తదితర అంశాల్లో చేయూతనిచ్చేందుకు ఈ ఫెడరేషన్ ఏర్పడడం అత్యంత అభినందనీయం అని చిరంజీవి వివరించారు. 

ఈ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుల అంకితభావం తనను ఆకట్టుకుందని అన్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, స్ఫూర్తిదాయకంగా నిలవడంలోనూ, సమాచార వ్యాప్తి, ఏకీకరణ సాధించే దిశగా డిజిటల్ మీడియా రంగం శక్తిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కు తమ ప్రభుత్వం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.


More Telugu News