పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది: కనకమేడల

  • రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను మూలనపడేశారన్న కనకమేడల
  • పోలవరంలో వేలాది కోట్ల నష్టం జరిగిందని ఆరోపణ 
  • రైతాంగం అధో స్థితికి పడిపోయిందని ఆవేదన 
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో మూలనపడేశారని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్ల నష్టం వాటిల్లిందని, జరిగిన నిర్మాణాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వం పోలవరంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, సాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకర పరిణామం అని కనకమేడల అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. దీని ఫలితంగా రాష్ట్ర రైతాంగం అధో స్థితికి పడిపోయిందని పేర్కొన్నారు. 

చంద్రబాబు హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో 1 కోటి 42 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే... జగన్ పాలనలో 2023-24 లో అది 30 లక్షల ఎకరాలకు పడిపోయిందని కనకమేడల వెల్లడించారు.


More Telugu News