నాతో శ్రీదేవి పెళ్లి జరిపించాలని వాళ్ల అమ్మగారు అనుకున్నారు: మురళీమోహన్

  • శ్రీదేవి ఫస్టు హీరో తానేనన్న మురళీమోహన్ 
  • 'బంగారక్క'లో ఆమె తన జోడీ అంటూ వెల్లడి 
  • తాను బుద్ధిమంతుడినని శ్రీదేవి తల్లి గ్రహించారని వ్యాఖ్య 
  • అప్పటివరకూ ఆమె నమ్మలేదని వివరణ

మురళీమోహన్ .. క్రమశిక్షణ కలిగిన నటుడు. హీరోగా అనేక సినిమాలలో నటించిన ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా అనేక సినిమాలు చేశారు. 'ఐ డ్రీమ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ, శ్రీదేవిని గురించి ప్రస్తావించారు. " చాలామంది హీరోయిన్ గా శ్రీదేవి ఫస్టు సినిమా 'పదహారేళ్ల వయసు' అనీ, తొలిసారిగా చంద్రమోహన్ జోడీగా చేసిందని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె ఫస్టు సినిమా చేసింది నాతో" అని అన్నారు.

" హీరోయిన్ గా శ్రీదేవి చేసిన మొదటి సినిమా 'బంగారక్క' .. ఆ సినిమాలో హీరో నేనే. సంగీతం మాస్టారుగా నేను .. స్టూడెంట్ గా తాను చేశాము. ఆ సినిమా సమయంలో నన్ను శ్రీదేవి వాళ్ల అమ్మగారు చూశారు. కుర్రాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు .. చేతిలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి ..  మా శ్రీదేవిని ఇచ్చి చేస్తే బాగుంటుందేమో' అని నాకు తెలిసిన ఆవిడతో అన్నారట.

'అయ్యో ఆయనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది .. ఇద్దరు పిల్లలు కూడా' అని నాకు తెలిసిన ఆవిడ చెప్పినా, శ్రీదేవి వాళ్ల అమ్మగారు నమ్మలేదట. 'అయితే చూద్దురుగాని రండి' అని ఆమె శ్రీదేవి వాళ్ల అమ్మగారిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకుని వచ్చారు. మా ఆవిడను .. మా ఇద్దరి పిల్లలను చూసిన తరువాత ఆమె నమ్మడం జరిగింది" అని చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఒకటి రెండు జరిగినా మా ఆవిడ లైట్ గానే తీసుకునేది" అని అన్నారు.


More Telugu News