గోర‌ఖ్‌పూర్ ఇంజినీరింగ్ విద్యార్థుల స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌.. ఆక‌తాయిల ప‌నిప‌ట్టే 'బ్లూటూత్ జుంకాలు'

  • మహిళలకు ఆయుధంలా 'బ్లూటూత్ జుంకాలు' 
  • బ్లూటూత్ ఇయర్‌బడ్‌తో పాటు రెండు అలారం స్విచ్లు 
  • మూడు ఎమర్జెన్సీ నంబర్లు ఫీడ్ చేసుకునే వెసులుబాటు
  • స్విచ్ నొక్కితే ఎమర్జెన్సీ నంబర్లకు లోకేష‌న్‌తో స‌హా కాల్ వెళ్లే సౌక‌ర్యం 
  • కేవ‌లం రూ.1650 ఖర్చుతో వీటి తయారీ
మహిళలపై వేధింపుల‌ను అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఇంజినీరింగ్ క‌ళాశాల విద్యార్థులు స‌రికొత్త‌గా ఆలోచించారు. సాంకేతిక‌త‌ను వినియోగించి 'బ్లూటూత్‌ జుంకాలు' త‌యారు చేశారు. ఆక‌తాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంగా ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. 

గోరఖ్‌పూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐటీఎం) ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థినులు కలిసి ఈ బ్లూటూత్ జుంకాలను తయారు చేయ‌డం జ‌రిగింది. కళాశాలలోని ఆవిష్కరణ విభాగం సమన్వయకర్త వినీత్రాయ్ ఆధ్వర్వంలో అఫ్రీన్ ఖాతూన్‌, హబీబా, రియాసింగ్‌, ఫాయా నూరీ ఈ జుంకాల‌ను తయారు చేశారు. ఈ బృందానికి వీటిని రూపొందించడానికి రెండు వారాల సమయం పట్టింది. 

చూడ‌టానికి సాధారణ జుంకాల మాదిరిగా కనిపించే వీటిలో బ్లూటూత్ ఇయర్‌బడ్‌ను అమర్చ‌డం జ‌రిగింది. ఈ జుంకాలు 35 గ్రాముల బరువు ఉంటాయి. వీటిలో బ్యాటరీతో కూడిన బ్లూటూత్‌ మాడ్యూల్‌, రెండు స్విచ్లు, చిన్న స్టీల్‌ పైపును అనుసంధానం చేశారు. వీటితో పాటు రెండు అలారం స్విచ్లు, మూడు ఎమర్జెన్సీ నంబర్లును ఫీడ్ చేస్తారు. 

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఒక స్విచ్ నొక్కితే ఎమర్జెన్సీ నంబర్లకు లోకేషన్‌తో పాటు కాల్‌ కూడా వెళ్తుంది. అలాగే మరో బటన్ నొక్కితే ఆకతాయిలపై మిరియాలు, మిర్చీ పొడి చల్ల‌డం జరుగుతుంది. త‌ద్వారా అమ్మాయిలు తమను తాము రక్షించుకోవచ్చుని విద్యార్థినులు తెలిపారు. ఇవి ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఓ ఆయుధంలా ఉపయోగపడతాయని ఈ సంద‌ర్భంగా వారు వివరించారు. ఇక వీటి త‌యారీకి రూ.1,650 ఖర్చు అయ్యింద‌ని వారు పేర్కొన్నారు.
 
కాగా, త‌మ‌ విద్యార్థుల ఈ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ పట్ల ఐటీఎం క‌ళాశాల‌ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌కే సింగ్, సెక్రటరీ అనుజ్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల ఎల్లప్పుడూ ఒక ప్రయోగంలో అవసరమైన పరికరాలను అందిస్తుందనీ, విద్యార్థులు పరిశోధనా కార్యకలాపాలను కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకుంటామని ఈ సంద‌ర్భంగా కళాశాల అధికారులు తెలిపారు.


More Telugu News