లోక్‌సభ ఎన్నికల్లో ఒకే స్థానం నుంచి తలపడుతున్న మాజీ భార్యాభర్తలు

  • పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్ నియోజకవర్గంలో ఆసక్తికర సమరం
  • బీజేపీ అభ్యర్థి సౌమిత్ర ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అతడి మాజీ భార్య సుజాత మోండల్
  • 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడిపోయిన జంట
  • తృణమూల్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం విడాకులు ఇచ్చిన సౌమిత్ర ఖాన్
లోక్‌సభ ఎన్నికలు-2024లో గెలుపు కోసం ఒకే స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు తలపడబోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం నుంచి సౌమిత్ర ఖాన్‌ను ఇప్పటికే బీజేపీ రంగంలోకి దింపింది. ఇటీవలే అధికారికంగా పేరుని కూడా ప్రకటించింది. అయితే ఇదే స్థానం నుంచి సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సుజాత మోండల్ పోటీకి దిగారు. బిష్ణుపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పేరుని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను పార్టీ హైకమాండ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో ఆమె అంగీకరించారు. దీంతో ఇప్పటికే విడాకుల ద్వారా విడిపోయిన ఈ మాజీ జంట ఎన్నికల రూపంలో మరోసారి తలపడబోతోంది. దీంతో వీరిద్దరి పోటీ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

కాగా 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌమిత్ర ఖాన్ - సుజాత మోండల్ విడిపోయారు. సుజాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయన విడాకులు ఇచ్చారు. ఈ మేరకు ఆ సమయంలోనే వీడియో ద్వారా విడాకులు ప్రకటించారు. కాగా సీనియర్ నాయకుడిగా ఉన్న సౌమిత్ర ఖాన్ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆ సమయంలో అతడికి సుజాత కూడా ప్రచారం చేయడం గమనార్హం.

కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీలకు మొండిచెయ్యి చూపించింది. అయితే మాజీ క్రికెటర్లు యూసుఫ్ పఠాన్, కీర్తి ఆజాద్‌లను రంగంలోకి దించింది. అంతేకాదు పలువురు కొత్త అభ్యర్థులను బరిలోకి దింపింది.


More Telugu News