కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు కూడా ఒకటే చెబుతున్నా: సీఎం జగన్

  • మేదరమెట్లలో సిద్ధం సభ
  • సీఎం జగన్ వాడివేడి ప్రసంగం
  • గత టీడీపీ మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు
  • ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపణ
మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. తనను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2014లోనూ ఇలాగే ముగ్గురూ కలిసి వచ్చారని, మేనిఫెస్టోపై ఫొటోలు వేసుకున్నారని, ఆ మేనిఫెస్టోపై చంద్రబాబు సంతకం పెట్టారని సీఎం జగన్ వెల్లడించారు. 

"రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాము, ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి, ఉద్యోగం, ఉపాధి కల్పించలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తాము, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, రాష్ట్రాన్ని సింగపూర్ ను మించిపోయేలా అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము... ఇదీ ఆనాడు చంద్రబాబు కూటమి మేనిఫెస్టో. 

ఇందులో చంద్రబాబు ఫొటో ఉంది, దత్తపుత్రుడి ఫొటో ఉంది, చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి పొత్తులోకి తీసుకువచ్చిన మోదీ గారి ఫొటో కూడా ఉంది. కానీ ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా అమలు అయ్యాయా అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా హామీ అమలైందా అని అడుగుతున్నా.

ఇలా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, మళ్లీ పొత్తు అంటూ చేయి కలిపి ఇదే డ్రామా ఆడేందుకు, మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు. చంద్రబాబు పొత్తు వల్ల ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? వీళ్లు ప్రజలకు మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ను టార్గెట్ చేయడమే వీళ్ల ఏకైక అజెండాగా కనిపిస్తోంది. 

చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంటే... దోచుకోవడానికి, పంచుకోవడానికి. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా... ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడడానికి... చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో ఉండాలి... అందుకే మీ బిడ్డకు అధికారం కావాలి. మంచి చేయడం కోసం మీ బిడ్డ పరితపిస్తున్నాడు. 

కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు కూడా ఒకటే చెబుతున్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశంలో మరే ఇతర పార్టీలు కూడా ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది... వారికి మంచి జరిగేందుకే మీ బిడ్డ ఉన్నాడు. 

త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో  తీసుకువస్తున్నాం. చేసేదే చెప్పాం... చెప్పామంటే చేస్తాం. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింకులోనే ఉండాలి. చంద్రబాబుకు ఓటేయడం అంటే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్టే. రంగురంగుల హామీలు ఇచ్చే చంద్రబాబు కావాలా... ప్రతి ఇంటికీ మంచి చేసే మీ బిడ్డ కావాలా... మీరే నిర్ణయించుకోండి" అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.


More Telugu News