బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తుకు మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • బీఆర్ఎస్ ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేకపోవడంతో అనుమతిచ్చారని వెల్లడి
  • ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసిన బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు
  • మాయావతి దూతగా తదుపరి చర్చలకు హాజరుకానున్న పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తుపై సస్పెన్స్ వీడింది. ఈ పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అంటూ ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. బీఎస్పీ- బీఆర్ఎస్‌ల కూటమి చర్చలపై నిన్న (శనివారం) ఏర్పడిన సందిగ్దానికి పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూటమిలోనూ లేనందున వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి అనుమతించారని వివరించారు. ఈ మేరకు బీఎస్పీ హైకమాండ్ సమాచారం అందించిందని చెప్పారు. పొత్తు విషయంలో త్వరలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో తదుపరి చర్చలు జరగనున్నాయని, ఈ చర్చలకు మాయావతి దూతగా బీఎస్పీ ఎంపీ, పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ హాజరుకానున్నరని వెల్లడించారు.


More Telugu News