‘ఇందిరమ్మ అభయం’ యాప్‌ను లాంచ్ చేసిన షర్మిల.. అర్హులైన మహిళల వివరాల నమోదు
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతినెల పేద మహిళలకు రూ. 5 వేలు
- అధికారంలోకి రాగానే ప్రతి పేదింటి మహిళను ఆదుకుంటామన్న షర్మిల
- మహిళా సాధికారత కోసమే ఈ పథకమన్న కాంగ్రెస్ ఏపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీలో జవజీవాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకోబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో పార్టీపై సానుకూల దృక్పథం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా, ‘ఇందిరమ్మ అభయం’ పథకం యాప్‌ను లాంచ్ చేశారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతినెల రూ. 5 వేలు అందిస్తారు. యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అర్హులైన కొందరు మహిళల వివరాలను అందులో పొందుపర్చారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేదింటి మహిళలకు సాధికారత కల్పించేందుకే ‘ఇందిరమ్మ అభయం’ పథకం తీసుకొచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 5 వేలు అందిస్తామని తెలిపారు. పేద కుటుంబాలను ఆదుకొనేందుకే కాంగ్రెస్ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.