కవిత మాట్లాడుతుంటే వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కూడా కవిత ఇలాగే మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్య
  • కేసీఆర్ కేబినెట్లో గతంలో మహిళలు లేరు... కానీ కాంగ్రెస్ కేబినెట్లో మంత్రులకు ప్రాధాన్యత ఉందని వెల్లడి
  • గతంలో తనకు ఇల్లే లేదన్న కవితకు ఇప్పుడు దుబాయ్‌లో కూడా ఇల్లు ఉందని గుర్తు చేసిన ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జీవో నెంబర్ 3 గురించి మాట్లాడుతుంటే వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా అనిపించిందని పాలకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు యశస్విని రెడ్డి ఎద్దేవా చేశారు. జీవో నెంబర్ 3 గురించి ఆమె మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కూడా కవిత ఇలాగే మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కానీ కవితకు ఇన్నాళ్లు గుర్తుకు రాకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నీ గుర్తుకు వస్తున్నట్లుగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభంలో కనీసం మహిళా మంత్రులు కూడా లేరని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మహిళలకు కేబినెట్లో ప్రాధాన్యత దక్కిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ వస్తోందన్నారు. తమ ప్రభుత్వ పథకాలలోనూ మహిళలకు ప్రాధాన్యత ఉన్న విషయం గుర్తించాలన్నారు. రూ.500కే సిలిండర్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాలు మహిళలకు సంబంధించినవే అన్నారు. గతంలో తనకూ ఇల్లే లేదని చెప్పిన కవితకు ఇప్పుడు దుబాయ్‌లో కూడా ఇళ్లు ఉందన్నారు. దీనిని ప్రజలంతా గుర్తిస్తున్నారన్నారు. మహిళల గురించి ఎవరు మాట్లాడినా సంతోషమేనని... కానీ అర్థవంతంగా ఉండాలని సూచించారు.


More Telugu News