నా తండ్రిపై దాడి చేయడం కాదు... వైసీపీ నేతలకు దమ్ముంటే నన్ను టచ్ చేయాలి: దస్తగిరి సవాల్

  • నిన్న రాత్రి దస్తగిరి తండ్రి హాజీ వలీపై దాడి
  • తన కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏముందన్న దస్తగిరి
  • ఇక నుంచి పులివెందుల వైసీపీ నేతలతో ఢీ అంటే ఢీ అని ప్రకటన
  • ఎవరినీ వదిలిపెట్టేది లేదు... దేనికైనా సిద్ధమని వెల్లడి 
వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తండ్రి హాజీ వలీపై నిన్న రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దస్తగిరి నేడు పులివెందులలో మీడియా సమావేశం నిర్వహించాడు. గత రాత్రి తన తండ్రి హాజీ వలీలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని దస్తగిరి ఆరోపించాడు. 

అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నాడు. అందుకే అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 12న హైదరాబాదులో సీబీఐ కోర్టులో విచారణకు హాజరవుతున్నానని, తన తండ్రిపై జరిగిన దాడి గురించి సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తానని దస్తగిరి వెల్లడించాడు. 

పులివెందుల వైసీపీ నాయకులకు దమ్ముంటే నన్ను టచ్ చేయాలి అని సవాల్ విసిరాడు. అయినా తన కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధమని అన్నాడు. పులివెందుల వైసీపీ నేతలతో ఇక నుంచి ఢీ అంటే  ఢీ అని ప్రకటించాడు. 

దస్తగిరి ఇటీవల జై భీమ్ భారత్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని, జగన్ ను ఢీకొడతానని దస్తగరి ఇప్పటికే ప్రకటించాడు. 

దస్తగిరి తండ్రిపై దాడిని జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ కూడా ఖండించారు. జగన్ పై పోటీ చేసేంత మొనగాడా అంటూ దస్తగిరి తండ్రి హాజీ వలీపై వైసీపీ గూండాలు విచక్షణ రహితంగా దాడి చేశారని, దస్తగిరి పోటీ నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని లేపేస్తామని హెచ్చరించారని జడ శ్రావణ్ కుమార్ వివరించారు.


More Telugu News