మోదీ గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గించడం మంచిదే... కానీ ఆ హామీ కూడా ఇవ్వాలి: కాంగ్రెస్ నేత చిదంబరం

  • బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధరను పెంచబోమని హామీ ఇవ్వాలన్న చిదంబరం
  • దేశానికి రాహుల్ గాంధీ ఐదు హామీలు ఇచ్చారని గుర్తు చేసిన కాంగ్రెస్ నేత
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ హామీలు నెరవేరుస్తామని స్పష్టీకరణ
నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం స్వాగతించారు. అయితే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ధరను పెంచబోమని ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని సూచించారు. శనివారం ఆయన చెన్నైలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ప్రధాని తమిళనాడుకు రూ.17,300 కోట్లు సహా దేశానికి రూ.5.90 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించారని గుర్తు చేశారు. వీటికి సంబంధించి కేటాయింపులు జరిపారా? అని ప్రశ్నించారు.

తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దేశానికి ఐదు హామీలు ఇచ్చారని, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవి ఎన్నికల హామీలుగా మారుతాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తుందని చెప్పారు.

30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు కొత్త చట్టం తేవడం, గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, యువత సొంత వెంచర్ల కోసం మూలధన మద్దతు వంటి హామీలు ఇచ్చామని... తాము అధికారంలోకి వస్తే వీటిని నెరవేర్చుతామన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై మాట్లాడుతూ... నేరస్థులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని, అలాగే బాధితులకు నగదు పరిహారం అందేలా చూస్తామన్నారు.


More Telugu News