చంచల్‌గూడ జైలును తరలిస్తాం: రేవంత్ రెడ్డి ప్రకటన

  • చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తామని రేవంత్ ప్రకటన
  • మూసీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య
  • తమకు ఎవరిపైనా కక్షలు లేవన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చంచల్ గూడ జైలును వేరే చోటుకు తరలిస్తామని చెప్పారు. చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తామని, అక్కడ కాలేజీ, స్కూలును నిర్మిస్తామని తెలిపారు. రాజకీయాలు, అభివృద్ధి వేర్వేరని... రెండింటినీ వేరుగా చూడాలని చెప్పారు. అభివృద్ధి కోసమే మున్సిపల్ శాఖను తన వద్ద ఉంచుకున్నానని తెలిపారు. తమ ప్రభుత్వం అభివృద్ధి పైనే పూర్తి దృష్టి పెడుతుందని చెప్పారు. హైదరాబాద్ లో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామని అన్నారు. 

2028 నాటికి పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని అన్నారు. అసెంబ్లీలో కేవలం ప్రజా సమస్యలపైనే పోరాడుతామని చెప్పారు. పాతబస్తీలో మెట్రో రైల్ శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. ఎంతో కష్టపడి రేవంత్ సీఎం స్థానానికి ఎదిగారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు నిలబడుతుందని... అవసరమైతే తాము అండగా నిలబడతామని అన్నారు.


More Telugu News