దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి హేయ‌మైన చర్య: 'జై భీమ్ భారత్' పార్టీ చీఫ్ శ్రావణ్ కుమార్

  • వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి కిరాతక చర్యలకు ఇది మరో సాక్ష్యమన్న శ్రావణ్ కుమార్ 
  • దస్తగిరిని పులివెందుల పోటీలో నుంచి త‌ప్పుకోవాల‌ని బెదిరించార‌ని ఆరోప‌ణ‌ 
  • దాడిపై ఈ 12న సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తామని వెల్లడి 
వ‌చ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడిని 'జై భీమ్ భారత్' పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కిరాతక చర్యలకు మరో సాక్ష్యం అని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైసీపీ గుండాలు ప్రయత్నించార‌ని అన్నారు. దస్తగిరి పోటీలో నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరించార‌ని తెలిపారు.

శుక్ర‌వారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పులివెందుల మండలం నమాలగుండు గ్రామంలో మాటు వేసి మరీ వైఎస్ అవినాశ్ రెడ్డి గుండాలు దాడి చేశాయ‌ని ఆయ‌న ఆరోపించారు. జగ‌న్‌పై పులివెందుల నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే దస్తగిరి ప్రకటించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. అనంత‌రం గత వారం జై భీమ్ రావ్ భారత్ పార్టీలో దస్తగిరి చేరారన్నారు. దస్తగిరి అభ్యర్థిత్వంపై ఏమీ చేయలేని వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి.. దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి చేయడం అనేది హేయ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. తక్షణమే దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ భద్రత కల్పించాలని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. 

అలాగే ద‌స్త‌గిరి కుటుంబంపై జరిగిన దాడిపై ఈ 12న సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. అవినాశ్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి హస్తం ఉందని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దారుణం జరిగిందని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో త‌న‌కు త‌న కుటుంబ సభ్యులకు తక్షణమే భద్రత కల్పించాల‌ని దస్తగిరి కోరారు.


More Telugu News