పాపం ఇంగ్లండ్.. ఒకే స్కోరు వద్ద మొత్తం మూడు రివ్యూలు కోల్పోయిన పర్యాటక జట్టు

  • 175 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
  • మూడుసార్లు రివ్యూకు వెళ్లినా ఆశాభంగమే
  • వరుసగా అవుటైన బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్
బజ్‌బాల్ వ్యూహంతో ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టు బొక్కబోర్లా పడింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించి జోరుమీదున్నట్టు కనిపించిన పర్యాటక జట్టును ఆ తర్వాత వరుసగా పరాజయాలు వెక్కిరించాయి. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని యోచిస్తున్న ఇంగ్లండ్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పడుతూ లేస్తూ ఉంది. 92 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఓటమి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.

ఇక, ఆ జట్టును దురదృష్టం కూడా వెక్కిరిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఒకే స్కోరు వద్ద మూడు రివ్యూలు కోల్పోయింది. 175 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగులో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో  అవుటయ్యాడు. అయితే, అది అవుట్ కాదని భావించిన బెయిర్ స్టో (29) రివ్యూకు వెళ్లాడు. ఫలితం వ్యతిరేకంగా రావడంతో క్రీజును వదిలిపెట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఓవర్‌లో జో రూట్ (26) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ అవుట్‌పై రూట్ రివ్యూకు వెళ్లాడు. ఈసారి కూడా ఫలితం వ్యతిరేకంగానే వచ్చింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద కెప్టెన్ బెన్‌స్టోక్స్ డకౌట్ అయ్యాడు. కుల్దీప్ బౌలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇది అవుట్ కాదని భావించిన స్టోక్స్ రివ్యూకు వెళ్లగా మళ్లీ నిరాశ కలిగించే ఫలితమే వచ్చింది. ఇలా ఒకే స్కోరు వద్ద ఇంగ్లండ్ తన మూడు రివ్యూలను కోల్పోయింది.


More Telugu News