ఫిబ్రవరిలో శాకాహారం ప్రియం.. మాంసాహారం చవక.. ఎందుకిలా?

  • గతేడాది ఫిబ్రవరిలో వెజ్ థాలీ ధర సగటున ప్లేట్ రూ. 25.6గా ఉంటే ఈసారి రూ. 27.5కు చేరిక
  • ఉల్లి, టమాటా, బియ్యం, పప్పు ధరలు పెరగడమే ఇందుకు కారణం
  • మాంసాహార థాలీ ధర రూ. 59.2 నుంచి రూ. 54కు దిగి వచ్చిన వైనం
  • జనవరితో పోల్చి చూస్తే అటుఇటు అయిన ధరలు
  • రోటీ రైస్ రేట్ నివేదికలో పేర్కొన్న క్రిసిల్
మన దేశంలో గత నెలలో శాకాహార భోజనం కాస్ట్లీగా మారితే, మాంసాహారం మాత్రం కొంత చవకగా దొరికింది. వెజిటేరియన్ థాలీ ఫిబ్రవరిలో 7 శాతం ప్రియంగా మారితే, అదే సమయంలో మాంసాహార భోజనం ధర 9 శాతం దిగివచ్చింది. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ సంస్థ క్రిసిల్  ‘రోటీ రైస్ రేట్’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

వెజిటేరియన్ భోజనంలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్ వంటివి ఉంటాయి. సగటున ప్లేట్ వెజ్ థాలీ ధర గతేడాది ఫిబ్రవరిలో రూ. 25.6గా ఉంటే ఈసారి రూ. 27.5కు పెరిగింది. ఉల్లి, టమాటా ధరలు వరుసగా 29, 38 శాతం పెరగడమే ఇందుకు కారణమని క్రిసిల్ పేర్కొంది. వీటితోపాటు బియ్యం, పప్పుల ధరలు కూడా పెరిగాయని గుర్తు చేసింది. అయితే, జనవరి (రూ. 28)తో పోల్చి చూస్తే మాత్రం వెజ్ థాలీ చౌకగానే ఉంది.

అదే సమయంలో మాంసాహార భోజనం మాత్రం ఫిబ్రవరిలో రూ. 59.2 నుంచి రూ.54 దిగివచ్చింది. వెజ్ థాలీలో ఇచ్చినవే మాంసాహారంలోనూ ఇస్తారు. అయితే, ఇందులో పప్పుకు బదులు చికెన్ వడ్డిస్తారు. గతేడాది నాన్ వెజ్ థాలీ ప్లేట్ సగటు ధర రూ. 59.2గా ఉంటే ఈసారి మాత్రం రూ. 54కు పడిపోయింది. అయితే, జనవరి (రూ. 52)తో పోలిస్తే మాత్రం ఫిబ్రవరిలో ధర కొంత ఎక్కువే. 

మొత్తం ధరలో 50 శాతం వెయిటేజీ ఉండే బ్రాయిలర్ ధరలో 20 శాతం తగ్గడమే నాన్ వెజ్ థాలీ తగ్గడానికి కారణమని క్రిసిల్ పేర్కొంది. జనవరితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కారణంగా ఫిబ్రవరిలో బ్రాయిలర్ ధరలు 10 శాతం పెరిగాయి. దీనికి తోడు రంజాన్ కారణంగా మాంసాహారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉంది.


More Telugu News