ఇవే నా చివరి ఎన్నికలు.. మంత్రి పదవి కూడా వద్దు: కొడాలి నాని

  • 2029కి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందన్న కొడాలి నాని
  • నియోజకవర్గంలోని పనులకు జగన్ డబ్బులిస్తే చాలని వ్యాఖ్య
  • తన కూతుళ్లకు కూడా రాజకీయాలపై ఆసక్తి లేదన్న నాని
వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు జరగనున్న ఎన్నికలే తనకు చివరివని... 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన సంచలన ప్రకటన చేశారు. తనకు వయసు అయిపోతోందని... ఇప్పుడు తన వయసు 52 ఏళ్లని, 2029 ఎన్నికల సమయానికి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందని ఆయన చెప్పారు. తన కూతుళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే తనకు మంత్రి పదవి అవసరం లేదని కొడాలి నాని చెప్పారు. తన నియోజకవర్గంలో రోడ్లకు పర్మినెంట్ గా స్ట్రక్చర్ వేయాలని... రోడ్లు, కాలువలు, వాల్స్ కు సీఎం జగన్ డబ్బులిస్తే చాలని అన్నారు. రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు ఖర్చయ్యే పనులు ఉన్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని... టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అనవసరమని చెప్పారు. తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వస్తాడేమో అని అన్నారు. 

మరోవైపు, ఇవే తనకు చివరి ఎన్నికలు అని కొడాలి నాని చెప్పడంపై నియోజకవర్గ కార్యర్తలే కాకుండా వైసీపీ పెద్దలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలు మాట్లాడుతూ... సింపథీ కోసమే కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 


More Telugu News