బిడ్డా... మల్లారెడ్డీ, మళ్లీ పాలు అమ్మేస్థాయికి తీసుకువెళతాం: మైనంపల్లి హెచ్చరిక

  • మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదన్న మైనంపల్లి హన్మంతరావు
  • అన్యాయంగా దోచుకున్న సొమ్మును తిరిగి ఇస్తేనే పార్టీలో చేర్చుకుంటామని వెల్లడి
  • దగ్గరుండి మల్లారెడ్డి అక్రమ భవనాలను కూల్చివేయిస్తానన్న కాంగ్రెస్ నేత
  • డబ్బులతోనే అన్నీ నడవవని మల్లారెడ్డి గుర్తుంచుకోవాలని సూచన
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మైనంపల్లి హన్మంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కండ్లకోయలో మీడియాతో మాట్లాడుతూ... భూకబ్జాదారు అయిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్ము తిరిగి ఇస్తేనే పార్టీలోకి రానిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళుతున్నాడని... తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని... కానీ బిడ్డా, ఇలా వాగితే నీ వెంట పడుతా.... నువ్వు ఏ పాలు అయితే అమ్మావో... ఆ స్థాయికి తీసుకువెళతానని హెచ్చరించారు.

పాలమ్మిన... పూలమ్మిన అని చెబుతుంటారు కదా... మళ్లీ ఆ స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళుతుందన్నారు. గత కేసీఆర్ పాలనలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు రూ.25వేల కోట్ల విలువైన దాదాపు 1200 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఇటీవల గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చడంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు కుమ్మక్కైనట్లుగా తెలుస్తోందన్నారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కేసీఆర్ బంధువు అని... అలాగే తహసీల్దారు మల్లారెడ్డికి తొత్తు అని ఆరోపించారు.

అందుకే మల్లారెడ్డి నిర్మాణాలను పాక్షికంగా కూల్చేశారన్నారు. త్వరలో కూల్చివేతల సమయంలో తానే అక్కడ నిలబడతానన్నారు. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లు పెట్టి అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తామన్నారు. ఈ అయిదేళ్లు తాను మల్లారెడ్డిని వెంబడిస్తానని హెచ్చరించారు. కూల్చివేతలు చేపట్టకుండా విద్యార్థులను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చేత దొంగ ఓట్లు నమోదు చేయించి అడ్డదారిలో ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. అక్రమార్కులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మల్లారెడ్డి ప్రయివేటు యూనివర్సిటీ తీసుకువచ్చి బీసీ, ఎస్సీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. మల్లారెడ్డీ... ఇక నీ ఆటలు సాగవు... ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఆక్రమించుకున్న భూములు తిరిగి ఇచ్చేయాలని షరతు పెట్టారు. డబ్బులతోనే అన్నీ నడవవని గుర్తుంచుకోవాలని సూచించారు.


More Telugu News