బీఆర్ఎస్ నేత సీతారామ్ నాయక్ ఇంటికి కిషన్ రెడ్డి... పార్టీలోకి ఆహ్వానం

  • మహబూబాబాద్ లోక్ సభ సీటు తనకు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్‌పై సీతారామ్ నాయక్ అసంతృప్తి
  • నేడు హన్మకొండలోని సీతారామ్ నాయక్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి
  • సీతారామ్ నాయక్ వంటి మంచి వారిని పార్టీలోకి తీసుకుంటామన్న కిషన్ రెడ్డి
  • పార్టీలోకి వస్తారా? రారా? అనేది ఆయన ఇష్టమని వ్యాఖ్య
  • జలగం వెంకట్రావుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కిషన్ రెడ్డి శుక్రవారం హన్మకొండలోని బీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్లారు. మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఇవ్వకపోడవంతో సీతారామ్ నాయక్ అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో ఆయనను కలిసిన కిషన్ రెడ్డి... బీజేపీలోకి ఆహ్వానించారు.

భేటీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాను వర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చానని, అలాగే సీతారామ్ నాయక్‌ను కలిసేందుకు వచ్చానని తెలిపారు. ఎందుకంటే గిరిజన వర్సిటీ కోసం గతంలో ఆయన ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మంచివారు ఎవరు బీజేపీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. సీతారామ్ వంటి వారిని తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బీజేపీలోకి వస్తారా? రారా? అన్నది ఆయన తేల్చుకోవాలన్నారు.

బీఆర్ఎస్ మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న సీతారామ్ నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

జలగం వెంకట్రావుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత జలగం వెంకట్రావుతో ఏపీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయనను బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ఖమ్మం లోక్ సభ సీటును ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు జలగం వెంకట్రావు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.


More Telugu News