ఇంతకుమించిన విషాదం ఉంటుందా?.. గర్భాశయ కేన్సర్‌తో ‘భాభీ‘ నటి డాలీ సోహి కన్నుమూత.. ముందు రోజు రాత్రే జాండీస్‌తో సోదరి మృతి

  • ఒక్క రోజు తేడాలో అక్కాచెల్లెళ్ల మృతి
  • ఆరు నెలల క్రితమే డాలీకి క్యాన్సర్ నిర్ధారణ
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • 47 ఏళ్ల వయసులో కన్నుమూత
  • గురువారం రాత్రి సోదరి అమన్‌దీప్ సోహి మృతి
ప్రముఖ నటి పూనమ్ పాండే ఇటీవల గర్భాశయ కేన్సర్‌‌పై చేసిన ప్రాంక్ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటు వివాదం కూడా చెలరేగింది. గర్భాశయ కేన్సర్‌తో ఆమె మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించింది. ఆ తర్వాతి రోజే పూనం పాండే స్వయంగా బయటకు వచ్చి తాను చనిపోలేదని, చాపకింద నీరులా విస్తరిస్తున్న గర్భాయ కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చారు. విషయం మంచిదే అయినా, అందుకు ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదంటూ విమర్శలు రావడంతో ఆమె టీం క్షమాపణలు చెప్పింది. అది వేరే విషయం.

తాజాగా టీవీ నటి డాలీ సోహి ఇదే కేన్సర్ బారినపడి 47 వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. వ్యాధితో పోరాడుతూ ఈ ఉదయం నవీ ముంబైలో తుదిశ్వాస విడిచారు. జనక్, భాభీ వంటి టీవీ షోలతో చిరపరిచితమైన డాలీ మరణవార్త అందరినీ కలచివేసింది. ఆమె గర్భాశయ కేన్సర్ బారినపడినట్టు ఆరు నెలల క్రితమే నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు.

‘‘ఆమె ఇక లేరు. అపోలో ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. కేన్సర్ ఆమె ఊపిరితిత్తుల వరకు పాకింది. ఆరోగ్యం క్షీణించడంతో గతరాత్రే డాలీని ఆసుపత్రిలో చేర్చాం. అంతలోనే ఆమె ప్రాణాలు విడిచింది’’ అని ఆమె సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు.  మరింత విషాదం ఏమిటంటే.. అంతకుముందు రోజు రాత్రే డాలీ సోదరి, నటి అమన్‌దీప్ సోహి పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందారు. డీవీ పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు మన్‌ప్రీత్ తెలిపారు.


More Telugu News