భారత్, ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందం.. ఇకపై లోకల్ కరెన్సీలోనే చెల్లింపులు
- అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై ఆర్‌బీఐ, బ్యాంక్ ఇండోనేషియా (బీఐ) సంతకాలు
- ద్వైపాక్షిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగం పెంచడమే లక్ష్యం
- భారతీయ రూపాయి, ఇండోనేషియా రూపయ్యాను ప్రోత్సహించినట్లు అవుతుందన్న ఇరు దేశాల ప్రతినిధులు
ద్వైపాక్షిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ), ఇండోనేషియాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఆర్‌బీఐ, బ్యాంక్ ఇండోనేషియా (బీఐ) గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకాలు చేశాయి. 'సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీలు భారత రూపాయి, ఇండోనేషియా రూపాయ్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎంఓయూపై సంతకం చేయడం జరిగింది' అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఇరుదేశాలకు చెందిన ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి సంబంధిత స్థానిక కరెన్సీలలో లావాదేవీలు జరపడానికి వీలు కలుగుతుందని తెలిపింది. ఈ ఎంఓయూపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ రూపాయి, ఇండోనేషియా రూపయ్యాను ప్రోత్సహించినట్లు అవుతుందని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు.