ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల ఖరారు.. వయనాడ్ నుంచి బరిలోకి రాహుల్ గాంధీ!

  • గతరాత్రి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులను ఖరారు చేసిందన్న కేసీ వేణుగోపాల్
  • త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ప్రకటన
  • శశిథరూర్ కూడా కేరళ నుంచి పోటీ  
గత రాత్రి తొలిసారిగా సమావేశమైన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏకంగా ఆరు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ‘‘కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ లో అభ్యర్థులను ఖరారు చేశాము. ఈ అంశంలో కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది’’ అని విలేకరులతో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ వర్గాల ప్రకారం, రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్..ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ నుంచి, జోస్నా మహంత్ కోర్బా నుంచి బరిలోకి దిగుతారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యనేతలందరూ ఈసారి బరిలోకి దిగుతున్నారు. కేరళలోని 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సీనియర్ నేత శశిథరూర్ కూడా ఎన్నికల్లో నిలబడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

కర్ణాటకలో రాష్ట్ర మంత్రులెవరూ లోక్‌సభ బరిలోకి దిగరని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనడంపై బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. బహుశా ఒకే ఒక మంత్రి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు, పార్టీ ఎంపీ డీకే సురేశ్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న కల్‌బుర్గీ స్థానంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, కమిటీ సోమవారం కూడా మరోసారి సమావేశం కానుంది. 

ఇదిలా ఉంటే, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో సీట్ల పంపంకంపై పార్టీలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. 48 సీట్ల విషయంలో మహావికాస్ అఘాడీతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. సీట్ల పంపకం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ఇండియా కూటమిలో తృణమూల్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మమతను బుజ్జగించడంలో తలమునకలై ఉంది.


More Telugu News