కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... డీఏ పెంపు

  • ఉద్యోగులకు డీఏను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం
  • జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులకు డీఎ, పెన్షనర్లకు డీఆర్ వర్తింపు
  • ఈ నిర్ణయంతో 49.18 లక్షల ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ వర్తిస్తాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల 49.18 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఖజానాకు ప్రతి ఏటా రూ.12,868.72 కోట్ల భారం పడుతుందన్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంపుదల ఉంటుందని తెలిపింది.

కాగా, కేబినెట్ సమావేశంలో ఏఐ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించింది. ముడి జనపనారకు మద్దతు ధరను రూ.285కు పెంచింది. ముడి జనపనారకు క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను రూ.5335గా నిర్ధారించింది.


More Telugu News