మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

  • ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసిన పద్మ రాజీనామా
  • గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మహిళా కమిషన్ చైర్మన్ పదవి అప్పగించిన జగన్
  • జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా పేరు
  • ఈసారి కూడా టికెట్ దక్కకపోవడంతోనే రాజీనామా అంటూ ఊహాగానాలు
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఏపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. జంపింగులు జోరుగా సాగుతుండడంతో ఎప్పుడు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

టికెట్ దక్కకపోవడమే కారణమా?
గత ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావించినప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా ఆమెకు టికెట్ లభించలేదు. దీంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. ఇప్పటి వరకు జగన్‌కు అండగా ఉండి విమర్శలను తిప్పికొట్టగలిగే నేతగా పేరున్న ఆమె ఇప్పుడు రాజీనామా చేయడం వెనక కారణం ఈసారి కూడా టికెట్ దక్కకపోవడమేనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అలాంటిదేం లేదు
ఈసారి ఎన్నికల్లో మైలవరం, లేదంటే జగ్గయ్యపేటలో ఏదో ఒకదాని నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని పద్మ భావించినట్టు చెబుతున్నారు. అయితే, ఈసారి కూడా ఆమెకు టికెట్ దక్కకపోవడం వల్లే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే, పద్మ వాదన మాత్రం మరోలా ఉంది. జగన్‌ను మరోమారు సీఎం చేసేందుకే తాను రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేమని, ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కావడం కోసమే పదవికి రాజీనామా చేసినట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు.


More Telugu News