మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు ‘నో వర్క్-నో పే’ రూల్

  • రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో కార్యాలయాలకు హాజరుకాని ఉద్యోగులు
  • సరైన కారణం లేకుండానే డుమ్మా కొడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం
  • అంగీకరించదగిన కారణం లేకుండా డుమ్మా కొడితే వేతనంలో కోత
మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు నిన్న ‘నో వర్క్-నో పే’ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కాని రోజును ఆబ్సెంట్‌గా పరిగణించి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి మినహాయిస్తారు.

రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్య కారణంగా కార్యాలయాలకు హాజరుకాని అధికారులను డిప్యూటీ కమిషనర్లు/ లైన్ డిపార్ట్‌మెంట్లు/ ఫీల్డ్ లెవల్ కార్యాలయాలకు అటాచ్ చేస్తామని ముఖ్య కార్యదర్శి (డీపీ) వినీత్ జోషీ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అక్కడి నుంచి వారు విధులు నిర్వర్తించుకోవచ్చని తెలిపారు. అటాచ్ చేసిన అధికారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లడం లేదని, విధులకు హాజరుకావడం లేదని తెలిసిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి వారికి ‘నో వర్క్-నో పే’ నిబంధన అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు అందరూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌లో ఆదేశించారు.


More Telugu News