ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో స్టార్ ఆటగాడికి చోటు

  • బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
  • జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
  • అరంగేట్రం చేసిన యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్
  • ధర్మశాల వేదికగా సిరీస్‌లో చివరి టెస్ట్ షురూ
భారత్, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్‌కు విరామం తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఈ మ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ గెలిచి ఉంటే తాము కూడా తొలి బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించామని, సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకొని సిరీస్‌ను ముగించాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఈ సిరీస్‌లో మునుపటి మ్యాచ్‌లతో పోల్చితే ఈ పిచ్‌పై మంచి బౌన్స్ లభించే అవకాశం ఉందని,  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

బుమ్రా తిరిగి అందుబాటలోకి రావడంతో ఆకాష్ దీప్ నుంచి పక్కనపెట్టామని వివరించాడు. ఇక రజత్ పటీదార్ గాయపడడంతో అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. ఇక 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నిజమైన దిగ్గజ క్రికెటర్ అని రోహిత్ శర్మ అన్నాడు. దేశానికి, కుటుంబానికి గర్వకారణమని అభిప్రాయపడ్డాడు. 

తుది జట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్ ), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.


More Telugu News