ఆర్థిక ఒత్తిళ్లతో ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్నంత చేయలేకపోయాం: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనే చేస్తోందన్న సజ్జల
  • ఉద్యోగులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన వైసీపీ అగ్రనేత
  • జులైలో పీఆర్సీ అమలు చేస్తామన్న మంత్రి బొత్స  
  • ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
ఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పదవీ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్నంత చేయలేకపోయామని అన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనే చేస్తోందని చెప్పారు. మున్ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. 

జులైలో పీఆర్సీ అమలు చేస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ
ఉద్యోగులకు హామీగా ఇచ్చిన పీఆర్సీని జులైలో అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు మంత్రుల బృందం ఇచ్చిన ఇతర హామీలు అన్నింటినీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో బండి శ్రీనివాసరావు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. బండి శ్రీనివాసరావు దంపతులకు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, సంఘం నాయకులు సన్మానం చేశారు. 43 ఏళ్లపాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నానని బండి శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని ప్రస్తావించారు.


More Telugu News