రూ.12,000 కోట్ల విలువైన మానవ వెంట్రుకల అక్రమ రవాణా... కొనుగోలు చేసే దేశాల్లో తొలి స్థానంలో చైనా

  • విదేశాల్లో భారత మానవ వెంట్రుకలకు భలే డిమాండ్
  • హైదరాబాద్ సహా పలు ప్రాంతాల ద్వారా అక్రమ రవాణా
  • చైనాతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాంలకు అక్రమ తరలింపు
మానవ శిరోజాల అక్రమ రవాణా... మీరు చదివింది నిజమే... మీరు హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఏమవుతుందో మీకు తెలుసా? విదేశాల్లో భారతీయుల వెంట్రుకలకు భలే డిమాండ్ ఉంది. దీంతో వెంట్రుకల అక్రమ రవాణా జరుగుతోంది. మన దేశం నుంచి మానవ వెంట్రుకలను కొనుగోలు చేసే దేశాల్లో చైనా ముందు స్థానంలో ఉంది. తాజాగా ఈడీ అధికారులు తెలంగాణలో రూ.11,793 కోట్ల మానవ వెంట్రుకల అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. 

చైనాతో పాటు  మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు భారతదేశ సరిహద్దుల మీదుగా మానవ వెంట్రుకలను అక్రమంగా తరలించిన కేసును ఈడీ విచారిస్తోంది. ఈ మానవ వెంట్రుకలను హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల మీదుగా అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు.

మానవ వెంట్రుకల అక్రమ రవాణాకు సంబంధించి 2021లోనే హైదరాబాద్‌కు చెందిన నైలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పాత్రను గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. వీరు బినామీ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ కోడ్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు. హైదరాబాద్, మిజోరాం, మయన్మార్‌ల ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లుగా గుర్తించారు. చైనాలో బట్టతల అక్కడి వారికి సమస్యగా మారింది. దీంతో విగ్గుల తయారీ, అమ్మకాలు అక్కడ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇక్కడి మానవ శిరోజాలకు డిమాండ్ ఏర్పడి అక్రమ రవాణా జరుగుతోంది.

ఫిబ్రవరి 2022లో ఈడీ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మయన్మార్‌కు వెంట్రుకల తరలింపును గుర్తించారు. మానవ వెంట్రుకలను విదేశాలకు తరలించేందుకు నైలా కంపెనీ పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నివేదిక ప్రకారం మానవ వెంట్రుకల అక్రమ రవాణా ద్వారా ప్రతి ఏటా దాదాపు రూ.8వేల కోట్లు హవాలా మార్గంలో అందుతున్నట్లుగా తేలింది.


More Telugu News