సిక్సులు బాదడం కోసం.. పాక్ ఆట‌గాళ్ల‌కు ఆర్మీ ట్రైనింగ్‌

  • ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విష‌యంలో త‌గ్గేదేలే అంటున్న‌ పాక్‌ క్రికెట్ బోర్డు
  • ప‌దిరోజుల పాటు మిలిట‌రీ ట్రైనింగ్ క్యాంపు 
  • పాక్ ఆట‌గాళ్లు సిక్స‌ర్లు కొట్ట‌లేక‌పోతున్నారంటున్న పీసీబీ ఛైర్మ‌న్ న‌ఖ్వీ 
  • ప్లేయ‌ర్లు జాతీయ జ‌ట్టుకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచ‌న‌
త‌మ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విష‌యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) ముగిసిన వెంట‌నే జాతీయ జ‌ట్టులోని ఆట‌గాళ్లంద‌రికీ ఆర్మీలో ట్రైనింగ్ ఇప్పించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పీసీబీ ఛైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ తాజాగా ప్ర‌క‌టించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు ప‌దిరోజుల పాటు ఈ ట్రైనింగ్ క్యాంపు ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. విదేశీ ఆట‌గాళ్ల త‌ర‌హాలో పాక్ ప్లేయ‌ర్లు సిక్స‌ర్లు కొట్ట‌లేక‌పోవ‌డ‌మే ఈ శిక్ష‌ణ‌కు ఒక కార‌ణంగా న‌ఖ్వీ పేర్కొన్నారు. సిక్స‌ర్లు అల‌వోక‌గా బాదాలంటే ఆర్మీ ట్రైనింగ్ త‌ప్ప‌నిస‌రి అని పీసీబీ భావిస్తోంది. ఇది త‌మ‌ ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుప‌రిచేందుకు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పీసీబీ ఛైర్మ‌న్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇక ఆట‌గాళ్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా టీ20 లీగ్‌ల‌పై దృష్టిసారించే బదులు జాతీయ జ‌ట్టుకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని నొక్కి చెప్పారు. "మీరు డబ్బు సంపాదించకూడదని నేను చెప్పడం లేదు. లేదా త్యాగం చేయమని మిమ్మల్ని అడగడం లేదు. మేము కూడా చేయడానికి సిద్ధంగా లేము. అయితే మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక సంవత్సరం క్రితం నన్ను పంజాబ్ (పాక్ లోని) ముఖ్యమంత్రిగా ఉండమన్నారు. అలా వుండడం వల్ల అది నా వ్యాపారంలో నాకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించింది. నేను దానిని పక్కనపెట్టి, అనేక అదనపు ఖర్చులను భరించవలసి వచ్చింది" అని నఖ్వీ చెప్పాడు. అంతేగాక ఆగ‌టాళ్ల‌కి తాను 100శాతం మ‌ద్ద‌తు ఇస్తానని తెలిపాడు. కానీ, పాకిస్థాన్‌కు వారి మొద‌టి ప్రాధాన్య‌త ఉండాల‌న్నారు. ఆ త‌ర్వాతే ప్ర‌పంచ టీ20 లీగ్‌ల విష‌య‌మై ఆలోచించాల‌ని చెప్పుకొచ్చాడు. కానీ, పాక్‌లో ప్లేయ‌ర్లు డ‌బ్బుకు మొద‌టి ప్రాధాన్య‌త‌ను ఇచ్చి, దేశాన్ని రెండో చాయిస్‌గా తీసుకోవ‌డం దురదృష్టకరం అని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

అయితే, పాకిస్థాన్ క్రికెట్ జట్టు సైన్యంలో శిక్ష‌ణ పొంద‌డం అనేది ఇదే తొలిసారి కాదు. మిస్బా-ఉల్-హక్ కెప్టెన్‌గా ఉన్న‌ సమయంలో ఇంగ్లండ్‌తో తమ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి పాకిస్థాన్ జట్టు కాకుల్ అకాడమీలో సైనికులతో శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. ఈ సిరీస్‌లో మిస్బా మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించాడు. ఆ స‌మ‌యంలో త‌న సెంచ‌రీ సెల‌బ్రేష‌న్స్‌ను కూసింత‌ భిన్నంగా చేసుకున్నాడు కూడా. ఈ శ‌త‌కం త‌ర్వాత మిస్బా.. పది పుషప్‌లు చేయ‌డంతో పాటు సైనిక వంద‌నం చేశాడు. త‌న ఫిట్‌నెస్‌కు మిలిట‌రీ శిక్ష‌ణ‌నే కార‌ణ‌మని అర్థం వ‌చ్చేలా అత‌డు ఇలా వెరైటీగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి పీసీబీ జాతీయ జ‌ట్టు స‌భ్యుల‌కు మిలిట‌రీ ట్రైనింగ్ ఇప్పించేందుకు సిద్ధ‌మ‌వుతోందన్న‌మాట‌.


More Telugu News