జ‌న‌సేనానికి హ‌రిరామ జోగ‌య్య మ‌రో లేఖ‌.. ఈసారి ఏకంగా అభ్య‌ర్థుల ఎంపిక‌తో లేఖ!

  • రెండో జాబితాలో ఉమ్మ‌డి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ హ‌రిరామ‌జోగయ్య 
  • బ‌లిజ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచ‌న‌
  • రాయ‌ల‌సీమ‌లో 20ల‌క్ష‌ల మంది వ‌ర‌కు బ‌లిజ సామాజికవ‌ర్గ ఓట‌ర్లు ఉన్నార‌ని వెల్ల‌డి
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండో జాబితాలోని ఉమ్మ‌డి అభ్య‌ర్థుల ఎంపిక కోసం బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనానికి కాపు సంక్షేమ సేన అధ్య‌క్షుడు, మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ జోగయ్య మ‌రో లేఖ రాశారు. టీడీపీతో జ‌న‌సేన పార్టీ పొత్తు అనంత‌రం త‌ర‌చూ ప‌వ‌న్‌కు ఆయ‌న లేఖ‌లు రాస్తున్నారు. ఇప్పుడు మ‌రోసారి రెండో జాబితాలోని అభ్య‌ర్థుల విష‌య‌మై హ‌రిరామ కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధానంగా రెండో జాబితాలో బ‌లిజ సామాజిక వ‌ర్గానికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్య‌త ఇవ్వాలని త‌న లేఖ‌లో ఆయ‌న పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ‌లో 20ల‌క్ష‌ల మంది వ‌ర‌కు బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఉన్నార‌ని ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాజ‌కీయ పార్టీ కూడా రాజ‌కీయంగా వారికి ఎలాంటి ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌లేద‌ని, ఆ లోటును జ‌న‌సేన తీరుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

ఇక జ‌న‌సేనానికి రాసిన లేఖ‌లో హ‌రిరామ జోగ‌య్య తెలిపిన ఉమ్మ‌డి అభ్య‌ర్థుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. మ‌ద‌న‌ప‌ల్లి నుంచి శ్రీరామ రామాంజ‌నేయులు, తిరుప‌తి నుంచి ఆర‌ణి శ్రీనివాసులు, రాజంపేట నుంచి ఎంవీ రావు, అనంత‌పురం నుంచి టీసీ వ‌రుణ్‌, పుట్ట‌ప‌ర్తి నుంచి బ్లూమూన్ విద్యాసంస్థ‌ల అధినేత శివ‌శంక‌ర్‌, తంబ‌ళ్ల‌ప‌ల్లి నుంచి కొండా న‌రేంద్ర‌, గుంత‌క‌ల్లు నుంచి మ‌ణికంఠ‌కు టికెట్ కేటాయించాల‌ని ఆయ‌న త‌న లేఖ ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కోరారు. త‌న‌కు ఉన్న రాజ‌కీయ అనుభ‌వంతో ముంద‌స్తు అంచ‌నాల‌ను వేస్తున్న‌ట్లు ఈ లేఖ‌లో హ‌రిరామ జోగయ్య పేర్కొన్నారు.


More Telugu News