మ‌హిళల‌ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్

  • డబ్ల్యూపీఎల్‌లో ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ షబ్నిమ్ ఇస్మాయిల్ సరికొత్త చ‌రిత్ర‌
  • మ‌హిళల‌ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత వేగ‌వంత‌మైన బంతి
  • గంటకు 132.1 కిలోమీట‌ర్ల ‌వేగంతో బౌలింగ్  
ఉమెన్స్‌ ప్రీమియ‌ర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ద‌క్షిణాఫ్రికాకు చెందిన‌ మీడియం పేస‌ర్ ష‌బ్నిమ్ ఇస్మాయిల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మ‌హిళల‌ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత వేగ‌వంత‌మైన బాల్ విసిరిన‌ (ఫాస్టెస్ డెలివ‌రీ) అరుదైన రికార్డును త‌న పేరున లిఖించుకుంది. కుడిచేతి వాటం పేస‌ర్ అయిన ష‌బ్నిమ్ ఏకంగా గంటకు 132.1 కిలోమీట‌ర్ల ‌వేగంతో బౌలింగ్ చేసి ఈ ఘ‌న‌తను న‌మోదు చేసింది. 

మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ ష‌బ్నిమ్ ఇలా ఫాస్టెస్ డెలివ‌రీతో రికార్డుకెక్కింది. మ‌హిళల‌ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే అత్యంత‌ వేగ‌వంత‌మైన బంతి. ఇంత‌కుముందు కూడా ఈ రికార్డు షబ్నిమ్ పేరిట‌నే ఉంది. 2016 మ‌హిళ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విండీస్‌తో మ్యాచ్‌లో ఆమె 128 కిలోమీట‌ర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేయ‌డం జ‌రిగింది. అలాగే 2022 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కూడా ష‌బ్నిమ్ 127 కేఎం/హెచ్ వేగంతో బౌలింగ్ చేసింది.  

ఇక ద‌క్షిణాఫ్రికా త‌ర‌ఫున ష‌బ్నిమ్ ఇస్మాయిల్ ఏకంగా తొమ్మిది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో పాల్గొన‌డం విశేషం. ఇటీవ‌లే ఆమె అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యింది. 34 ఏళ్ల ష‌బ్నిమ్ త‌న 16 ఏళ్ల‌ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తంగా 127 వ‌న్డేలు, 113 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 317 వికెట్లు (వ‌న్డే-191, టీ20-123, టెస్టు-3) ప‌డ‌గొట్టింది.   

కాగా, మంగ‌వారం నాటి మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 192 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో జెమీయా రొడ్రిగ్స్ 33 బంతుల్లో 69 నాటౌట్‌), కెప్టెన్ లాన్నింగ్ (38 బంతుల్లో 53 ప‌రుగులు) అర్ధ‌శ‌తకాల‌తో రాణించారు. ఇక 193 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేదన‌తో బ‌రిలోకి దిగిన ముంబై 163 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 29 ప‌రుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజయం న‌మోదు చేసింది. ఈ విజ‌యంతో ఢిల్లీ పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానానికి చేరింది. ఈ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచులు ఆడి, నాలుగు విజ‌యాలు న‌మోదు చేయ‌డంతో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉంది.


More Telugu News